
వేసవి కాలంలో చిరుజల్లులు పడితే ఎవరికైనా ఆనందమే కానీ హైదరాబాద్ నగరంలో సోమవారం రాత్రి భారీ ఈదురుగాలులు, ఉరుములు,మెరుపులతో కురిసిన వర్షం నగరవాసులను హడలెత్తించింది. ఆ ఈదురుగాలుల ధాటికి నగరం నడిబొడ్డున ఉన్న ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ టవర్ కూలిపోయింది. ఉప్పల్ స్టేడియంలో దక్షిణ గ్యాలరీ షెడ్, ఒక ఎల్ఈడీ లైట్ ప్యానల్ కూలిపోయాయి.
ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఉన్న షెడ్లు కూలిపోయి వాటి రేకులు గాలిలో ఎగిరాయి. నగరంలో అనేక చోట్ల భారీ వృక్షాలు నెలకొరగడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. కొన్ని చోట్ల వాటి క్రింద పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈదురుగాలుల ధాటికి నగరంలో కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు కూలాయి. కానీ విద్యుత్ శాఖ సిబ్బంది ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ విద్యుత్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
లక్డీకపూల్, చాంద్రాయణగుట్ట, లోయర్ ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాలలో ఈదురుగాలులతో పాటు భారీ వర్షం కురవడంతో ఆ సమయంలో రోడ్లపైనున్న ప్రజలు అల్లాడిపోయారు. ఆల్వాల్, తార్నాక, మూసారాం బాగ్‌లో తదితర ప్రాంతాలలో చెట్లు కూలిపోయాయి. సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు సాగిన ప్రకృతి విలయతాండవన్నీ చూసి హైదరాబాద్‌వాసులు హడలిపోయారు.