గండ్ర దంపతులు కాంగ్రెస్‌కు గుడ్ బై

ఊహించినట్లుగానే భూపాలపల్లి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్న ఆయన భార్య గండ్ర జ్యోతి కూడా తన పదవికి రాజీనామా చేశారు. వారిరువురూ సోమవారం తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలవగా ఆయన వారిని పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. పార్టీలో ఇంకా చేరకముందే గండ్ర జ్యోతిని వరంగల్ గ్రామీణ జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ అభ్యర్ధిగా కేటీఆర్‌ ఖరారు చేశారు. 

కేటీఆర్‌తో భేటీ అనంతరం గండ్ర దంపతులిరువురూ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి వేర్వేరుగా తమ రాజీనామా  లేఖలు పంపించారు. గండ్ర వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రజలందరూ తెరాస వైపు ఉన్నారు కనుక ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవడం నా బాధ్యత. నా భూపాలపల్లి జిల్లా, నా నియోజకవర్గం అభివృద్ధి కోసమే నేను తెరాసలో చేరుతున్నాను. ఎన్నికల సందర్భంగా ప్రజలకు నేనిచ్చిన హామీలన్నీ సిఎం కేసీఆర్‌ సహాయసహకారాలతో నెరవేరుస్తాను.  అవసరమైతే కాంగ్రెస్ పార్టీ ద్వారా లభించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను,” అని అన్నారు. 

గండ్ర జ్యోతి మాట్లాడుతూ, “నా భర్త తెరాసలోకి వెళుతున్నప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం సరికాదు కనుక నా భర్త అడుగుజాడలలోనే నడవాలని నిర్ణయించుకొన్నాను,” అని చెప్పారు. తనకు రాజకీయంగా ఎదగడానికి అవకాశం కల్పించిన పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి, కాంగ్రెస్‌ పెద్దలందరికీ ఆమె తన రాజీనామా లేఖలో కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. 

ఊహించినట్లుగానే గండ్ర వెంకటరమణ కాంగ్రెస్ పార్టీని వీడారు. నేడో రేపో భద్రాచలం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పోడెం వీరయ్య, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా తెరాసలో చేరే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలువగా వారిలో ఇప్పటి వరకు 11 మంది పార్టీని వీడి తెరాసలో చేరారు. రేపు మరో ఇద్దరు కూడా వీడితే కాంగ్రెస్ పార్టీలో ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలి ఉంటారు. వారిలో ఎంతమంది కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉంటారో అనుమానమే.