తెలంగాణలో 10 ఎంపీ స్థానాలు మావే: కుంతియా

రాష్ట్రంలో నిన్న జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కనీసం 10 ఎంపీ సీట్లు గెలుచుకోబోతోందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ రాంచంద్ర కుంతియా ధీమా వ్యక్తం చేశారు. స్వతంత్రంగా నిష్పక్షపాతంగా వ్యవహరించవలసిన రాష్ట్ర ఎన్నికల సంఘం తెరాసకు అనుకూలంగా వ్యవహరించడం చాలా శోచనీయమని అన్నారు. నిజామాబాద్‌లో 185 మంది అభ్యర్ధులున్నప్పుడు బ్యాలెట్ పేపర్లతో పోలింగ్ నిర్వహించకుండా ఈవీఎంలతో నిర్వహించడమే అందుకు చక్కటి ఉదాహరణ అని కుంతియా అన్నారు. అయినప్పటికీ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీనే గెలిపించబోతున్నారని అన్నారు. దేశంలో ఇతర రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్‌ మిత్రపక్షాలకే అనుకూలవాతావరణం కనిపిస్తోందని కనుక కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడం, రాహుల్ గాంధీ ప్రధాని కావడం తధ్యమని కుంతియా అన్నారు. 

లోక్‌సభ ఎన్నికల తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనబడకుండా పోతుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ జోస్యం చెపుతుంటే, కాంగ్రెస్ పార్టీ 10 ఎంపీ స్థానాలు గెలుచుకొని కేంద్రంలో అధికారంలోకి రాబోతోందని కుంతియా జోస్యం చెపుతున్నారు. ఈ ఎన్నికలలో 16 ఎంపీ సీట్లు మేమే గెలుచుకోబోతున్నామని చివరివరకు నమ్మకంగా చెప్పిన తెరాస ఏమి చెపుతుందో చూడాలి.