ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవిధంగా పోలింగ్

రెండు తెలుగు రాష్ట్రాలలో పోలింగ్ ముగిసింది. తెలంగాణలో చాలా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది కానీ ఏపీలో మాత్రం పలుచోట్ల టిడిపి, వైసీపీ కార్యకర్తలు కర్రలు, కత్తులతో పరస్పరం దాడులు చేసుకొన్నారు. ఉదయం 11 గంటల వరకు అనేక చోట్ల ఈవీఎంల మొరాయించాయి. అయినప్పటికీ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయని ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ద్వివేది సమర్ధించుకొన్నారు. 

పోలింగ్ కేంద్రాల వద్ద టిడిపి, వైసీపీ కార్యకర్తల మద్య జరిగిన ఘర్షణలు చూసినప్పుడు ఎట్టి పరిస్థితులలో ఈ ఎన్నికలలో గెలవాలని ఆ రెండు పార్టీలు ఎంతగా ప్రయత్నించాయో అర్ధం అవుతుంది. ఎన్నికల జరిగిన తీరును బట్టి ఈసారి ఏపీలో వైసీపీకి మెజార్టీ లభించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ వైసీపీ గెలిచి జగన్‌ ముఖ్యమంత్రి అయితే చంద్రబాబునాయుడుకు, టిడిపి గెలిచి మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే జగన్‌కు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోకతప్పకపోవచ్చు. ఆ ‘ఇబ్బంది’ ఏ స్థాయిలో ఉంటుందనేది కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారనే దానిని బట్టి ఆధారపడి ఉంటుంది. అప్పటి పరిణామాల సంగతి పక్కనపెడితే ఇవాళ్ళ ఏపీలో జరిగిన ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లు జరిగాయని చెప్పక తప్పదు.