రెండు తెలుగు రాష్ట్రాలలో పోలింగ్ షురూ

రెండు తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా మొత్తం 91 లోక్‌సభ స్థానాలకు నేడు మొదటిదశ ఎన్నికలు జరుగబోతున్నాయి. వాటితో పాటు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలోని 175 స్థానాలకు కూడా నేడు ఎన్నికలు జరుగబోతున్నాయి. నిజామాబాద్‌ వంటి కొన్ని నియోజకవర్గాలలో తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాలలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగబోతోంది. 

తెలంగాణ రాష్ట్రంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల్, మంధని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వారావుపేట ప్రాంతాలలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుంది. 

నిజామాబాద్‌లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో 185 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నందున ఏకంగా 12 ఈవీఎంలను ఉపయోగించి పోలింగ్ నిర్వహించబోతున్నారు కనుక వాటిలో నుంచి తమకు నచ్చిన అభ్యర్ధిని వెతికి పట్టుకోవడం ఓటర్లకు పరీక్ష వంటిదేనని చెప్పవచ్చు. 

రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు మొత్తం 443 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. వారిలో పురుషులు: 418, మహిళలు 25 మంది ఉన్నారు. ప్రధానపార్టీలకు చెందినవారు 83 మంది పోటీ చేస్తున్నారు.  

రాష్ట్రంలో మొత్తం 2,97,08,600 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 1,49,30,726 మంది మహిళలు: 1,47,76,370 మంది, ఇతరులు: 1,504 మంది, విదేశాలలో ఉన్న ఓటర్లు: 1,731 మంది, సర్వీస్ ఓటర్లు: 11,320 మంది ఉన్నారు. 

రాష్ట్ర ఎన్నికల సంఘం మొత్తం 34,604 పోలింగ్ కేంద్రాలను, వెబ్‌సైట్‌లో క్యాస్టింగ్ కేంద్రాలు: 4,169, డిజిటల్ కెమెరా, ల్యాప్ టాప్ కలిగినవి: 21,360, వీడియోగ్రఫీ ఏర్పాటు కలిగినవి: 13,244 ఏర్పాటు చేసింది.  

ఈసారి రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రధానపార్టీలు చాలా హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో పోటీ చాలా తీవ్రంగా ఉంది. కొన్ని నియోజకవర్గాలలో ఉదయం 6 గంటలకే ఓటర్లు పోలింగ్ బూత్ ల వద్దకు చేరుకొని ఓట్లు వేసేందుకు క్యూ లైన్లలో నిలబడ్డారు. కొద్ది సేపటి క్రితమే పోలింగ్ ప్రారంభం అయ్యింది.   

మే 23 వ తేదీన దేశవ్యాప్తంగా ఒకేసారి ఓట్లు లెక్కించి అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు.