.jpg)
ఏప్రిల్ 11న జరుగబోయే లోక్‌సభ మొదటిదశ ఎన్నికలకు నేటితో ప్రచారం గడువు ముగియనుంది. ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్ ముగిసే సమయానికి సరిగ్గా 48 గంటల ముందు ఎన్నికల ప్రచారం ముగించవలసి ఉంటుంది. కనుక మంగళవారం సాయంత్రం 5 గంటలకు అన్ని పార్టీలు ప్రచారం ముగించవలసి ఉంటుంది. అలాగే సాయంత్రం 6 గంటల తరువాత ప్రింట్ అండ్ ఎలక్ట్రానికి మీడియాలో కూడా ఎటువంటి ప్రచారం చేయకూడదని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు.
నిజామాబాద్‌లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది కనుక ఆ ఒక్క నియోజకవర్గంలో మాత్రం సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చు. అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఎల్లెందు, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వారావుపేట పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకే నిర్వహించాలని నిర్ణయించినందున ఆ ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం సాయంత్రం 4 గంటలకే ముగించవలసి ఉంటుందని రజత్ కుమార్ చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్‌సభ నియోజకవర్గాలలో మొత్తం 2,97,08,599 మంది ఓటర్లున్నారని తెలిపారు. వారిలో సర్వీస్ ఓటర్లు 11,320, విదేశాలలో ఉన్న ఓటర్లు 1,731 మంది ఉన్నారని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 34,604 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని తెలిపారు. వాటిలో 4,169 కేంద్రాలలో వెబ్‌సైట్‌లో క్యాస్టింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో సమస్యాత్మకంగా గుర్తించిన 6,445 పోలింగ్ కేంద్రాలలో సిసి కెమెరాలను ఏర్పాటు చేశామని చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్పారు.
కేవలం ఓటరు స్లిప్పుతో ఓటు వేయడానికి అనుమతించబోమని, అందరూ విధిగా తమ ఓటరు కార్డు లేదా రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, పాసు పోర్ట్ మొదలైన 11 రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి చూపించవలసి ఉంటుందని అన్నారు.