
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో 185 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నప్పటికీ 12 ఈవీఎంల ద్వారా పోలింగ్ నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించినందున అక్కడ పోలింగ్ ప్రక్రియ సంక్లిష్టంగా మారింది. కనుక ఆ ఒక్క నియోజకవర్గంలో పోలింగ్ ఒక గంట ఆలస్యంగా...అంటే ఉదయం 8 గంటల నుంచి ప్రారంభించి, సాయంత్రం ఒక గంట అదనంగా...అంటే 6 గంటలవరకు నిర్వహించబోతున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. మిగిలిన 16 నియోజకవర్గాలలో యధావిధిగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉదయం 6 నుంచి 8 గంటల వరకు మాక్ పోలింగ్ నిర్వహించి, ఈవీఎం, వివి ప్యాట్ యంత్రాలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయని నిర్ధారించుకొనేందుకే గంట ఆలస్యంగా పోలింగ్ నిర్వహిస్తామని రజత్ కుమార్ చెప్పారు.
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పోలింగ్ సమయంలో ఈవీఎంలు మొరాయించినట్లయితే తక్షణమే మరమత్తులు చేయడానికి ఇంజనీర్లను, వారిని ఆయా పోలింగ్ బూత్ వద్దకు తరలించేందుకు ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక హెలీప్యాడ్ ఏర్పాటు చేశామని తెలిపారు. స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేస్తున్న రైతులు మంగళవారం నిజామాబాద్లో బహిరంగసభ నిర్వహించుకొనేందుకు అనుమతి మంజూరు చేశామని తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రధానకార్యదర్శి ఎస్.కె.జోషి ఓటర్లను తెరాసకు అనుకూలంగా ప్రభావితం చేసేవిధంగా సచివాలయంలో ‘టువర్డ్స్ గోల్డెన్ తెలంగాణ’ నివేధికను విడుదల చేయడం కాంగ్రెస్ నేతలు చేసిన ఫిర్యాదును కేంద్రఎన్నికల సంఘానికి నివేదించానని రజత్ కుమార్ తెలిపారు.
నిజామాబాద్ లోక్సభ ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ నిజామాబాద్ రైతులు వేసిన పిటిషనుపై ఇవాళ్ళ హైకోర్టు తీర్పు చెప్పే అవకాశం ఉంది.