త్వరలో మరో సర్జికల్ స్ట్రైక్?

పార్లమెంటు ఎన్నికలలో లబ్ది పొందేందుకే మోడీ ప్రభుత్వం తమ భూభాగంపై సర్జికల్ స్ట్రైక్ చేసిందని కనుక లోక్‌సభ ఎన్నికలు ముగిసేలోగా మళ్ళీ మరోసారి అటువంటి ప్రయత్నం చేయవచ్చునని, చేస్తే ఈసారి  గట్టిగా తిప్పికొడతామని పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. 

తాజాగా పాక్ దేశ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ ఒక సంచలన ప్రకటన చేశారు. ఇస్లామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “మా ఇంటలిజన్స్ వర్గాల తాజా సమాచారం ప్రకారం ఈ నెల 16 నుంచి 20లోగా భారత్‌ మళ్ళీ మన భూభాగంపై దాడి చేయడానికి సిద్దం అవుతోంది. ప్రదాని ఇమ్రాన్ ఖాన్‌ ఆదేశాల మేరకే ఈ విషయం దేశప్రజలకు తెలియజేస్తున్నాను,” అని అన్నారు. 

దీనిపై భారత్‌ విదేశాంగశాఖ ఇంకా స్పందించవలసి ఉంది. ఒకవేళ పాక్‌ చెపుతున్నట్లు ఆ దేశంపై భారత్‌ మళ్ళీ దాడికి ప్రయత్నిస్తే ఈసారి పాక్‌ కూడా ధీటుగానే స్పందించడం ఖాయం. అది యుద్ధానికి దారి తీసినా ఆశ్చర్యం లేదు. 

ఏప్రిల్ 18,23,29 తేదీలలో బిజెపికి అత్యంత కీలకమైన ఉత్తరాది రాష్ట్రాలలో ఎన్నికలు జరుగబోతున్నాయి. పాక్‌ చెపుతున్న ఆ సమయానికి మోడీ ప్రభుత్వం మళ్ళీ పాక్‌పై దాడి చేస్తే ఎన్నికలలో లబ్ది పొందేందుకే చేసిందన్న ప్రతిపక్షాల వాదనలు నిజమని అనుమానించవలసి వస్తుంది. 

కానీ పాక్‌ తొందరపడి చేసిన ఈ ప్రకటనే బిజెపికి చాలా ఉపయోగపడేదిగా ఉంది. మళ్ళీ సర్జికల్ స్ట్రైక్ చేయనవసరంలేకుండానే బిజెపి పాక్‌ చేసిన ఈ తాజా ప్రకటనను తనకు అనుకూలంగా మలుచుకొని ఎన్నికలలో ప్రచారం చేసుకొని లోక్‌సభ ఎన్నికలలో లబ్ది పొందే ప్రయత్నం చేసినా ఆశ్చర్యం లేదు.