
ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోక్‌సభ ఎన్నికలు మొదలయ్యేలోగానే పార్టీకి, రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. వ్యక్తిగత కారణాల వలన రాజకీయాల నుంచి తప్పుకొంటున్నానని, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ ప్రతినిధిగా చేసిన విమర్శలకు ఎవరైనా నొచ్చుకొని ఉంటే క్షమించవలసిందిగా ట్వీట్ చేశారు. తనకు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అవకాశం కల్పించిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి, రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై తనను ఎవరూ రాజకీనాయకుడిగా భావించవద్దని బండ్ల గణేశ్ కోరారు.
కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు రాజేంద్రనగర్ లేదా జూబ్లీ హిల్స్ నుంచి శాసనసభకు పోటీ చేయాలనుకొన్నారు. కానీ పార్టీలో టికెట్ల కోసం ఒత్తిడి ఎక్కువ ఉండటంతో బండ్లకు టికెట్ లభించలేదు. ఏనాటికైనా శాసనసభలో అడుగుపెట్టి మంత్రి పదవి చేపట్టాలనేది తన జీవితాశయం అని చెప్పుకొన్న బండ్ల గణేశ్ 5 నెలలు తిరక్క మునుపే రాజకీయాల నుంచి నిష్క్రమించడం చూస్తే ఆయన కేవలం శాసనసభ టికెట్ కోసమే రాజకీయాలలోకి వచ్చారని అర్ధం అవుతోంది.
రాజకీయాల నుంచి తప్పుకొంటున్నానని చెపుతూనే మళ్ళీ “నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం, నా ఆరాధ్యదైవం పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలనుకొంటున్నాను,” అని గురువారం మరో ట్వీట్ చేసారు. దాంతో బండ్ల జనసేనలోకి వెళ్ళే ఆలోచనలో ఉన్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ అటువంటి ఉద్దేశ్యమే ఉంటే ఏపీ అసెంబ్లీకి ఎన్నికల గంట మోగిన వెంటనే జనసేనలో చేరి ఉండాలి. పవన్ కల్యాణ్ మళ్ళీ సినిమాలలోకి వెళ్తారో లేదో కూడా తెలియదు. కనుక ఇప్పుడు పవన్ కల్యాణ్‌కు ఎంత భజన చేసి ఏమి ప్రయోజనం?