
సినీహీరోలకు ప్రజలలో విపరీతమైన పాపులారిటీ ఉంటుంది. వారు ఎక్కడకు వెళ్ళినా వారిని చూసేందుకు జనాలు ఎగబడుతుంటారు. కనుక సునాయాసంగా అధికారం చేజిక్కించుకోవచ్చుననే భ్రమతో కొందరు హీరోలు రాజకీయాలలో ప్రవేశిస్తుంటారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఆవిధంగానే సునాయాసంగానే అధికారంలోకి రాగలిగారు. అది చూసి మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రజారాజ్యంలోకి వచ్చారు కానీ అనూహ్యంగా బోర్లాపడ్డారు. నాలుగేళ్ళు రాజకీయాలలో ఆపసోపాలు పడిన తరువాత మళ్ళీ సినీ పరిశ్రమలోకి వెళ్ళిపోయారు.
తరువాత తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేనతో ప్రజలలోకి వచ్చారు. కానీ గత ఎన్నికలలో పోటీ చేయకుండా టిడిపి-బిజెపి కూటమికి మద్దతు ఇవ్వడం, ప్రశ్నించడానికే రాజకీయాలలోకి వచ్చానన్న వ్యక్తి ఎన్నికలైపోయిన తరువాత మళ్ళీ సినిమాలలోకి వెళ్లిపోవడంతో ఆయన రాజకీయ ప్రవేశం కూడా మూన్నాళ్ళ ముచ్చటేననుకొన్నారు. కానీ సుమారు ఏడాది క్రితం సినిమాలకు గుడ్ బై చెప్పేసి పూర్తి సమయం రాజకీయాలలోనే ఉంటూ జనసేన పార్టీని నిర్మించుకోవడం మొదలుపెట్టారు.
ఈ ఏడాది కాలంలో ఎదురైన అనేక అనుభవాలు, ఒడిదుడుకులు, అవహేళనలను అన్నిటినీ నిబ్బరంగా తట్టుకొని చివరికి ఎన్నికల బరిలో దిగి, వెనకడుగు వేసే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో తలమునకలైన పవన్ కల్యాణ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, “యాక్టర్లు జనాలలో వారి పాపులారిటీ వేరు...రాజకీయాలు వేరు. సినీనటులు మాటలు చెపుతున్నప్పుడు చప్పట్లు బాగానే పడతాయి. కానీ చప్పట్లు కొట్టినవారందరూ మనకే ఓట్లు వేస్తారనే గ్యారెంటీ ఏమీ లేదు. కనుక ఆ చప్పట్లను చూసి విజయం సాధించినట్లు మురిసిపోకూడదు. వాటిని నమ్మకూడదు కూడా. మనపై మనకు నమ్మకం కలిగి, చిత్తశుద్ధితో పనిచేసుకుపోతుంటే సత్ఫలితాలు వాటంతట అవే వస్తాయి. అంతవరకు కష్టపడుతూనే ఉండాలి. జగన్మోహన్రెడ్డికి బలం ఉందని అలీ భావించి ఉండవచ్చు అందుకే వైసీపీలో చేరి ఉండవచ్చు. ఎవరు ఏ పార్టీలోనైనా చేరవచ్చు. ఆ ఛాయిస్ అందరికీ ఉంటుంది,” అని అన్నారు.