
హైదరాబాద్ నగరవాసులకు ఉగాది సందర్భంగా మెట్రో రైల్ సేవలను నిర్వహిస్తున్న ఎల్&టి సంస్థ చిన్న బహుమతి ప్రకటించింది. రోజు టికెట్ కొనే అవసరం లేకుండా ప్రయాణించేందుకు వీలుగా ప్రవేశపెట్టిన స్మార్ట్ కార్డు ధరను తగ్గించి రూ.75లకే అందజేయబోతోంది. అయితే ఈ సదుపాయం కేవలం మూడు నెలలకే పరిమితమని తెలిపింది. రూ.75 విలువున్న స్మార్ట్ కార్డులో రూ.50 వరకు మెట్రో ప్రయాణానికి ఉపయోగించుకోవచ్చు. ఆ తరువాత కనీసం రూ.50 గరిష్టంగా రూ.3,000 వరకు రీ-చార్జ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు.
ఎల్&టి సంస్థ ఇప్పటి వరకు 6 లక్షల స్మార్ట్ కార్డులు విక్రయించింది. మెట్రోలో రోజూ 1.50 లక్షల మంది స్మార్ట్ కార్డు వినియోగించుకొని ప్రయాణిస్తున్నారు. దీనివలన టికెట్ల కోసం ప్రతీ స్టేషన్ వద్ద క్యూలైన్లో నిలబడే బాధ ఉండదు. ప్రయాణానికి సరిపడినన్ని డబ్బులు జేబులో ఉన్నాయా లేవా అని రోజూ చూసుకోనవసరం ఉండదు. ఒక్కసారి అవసరమైనంత రీ-ఛార్జ్ చేసుకొంటే హాయిగా ప్రయాణించవచ్చు. అందుకే స్మార్ట్ కార్డులు ఉపయోగించేవారి సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. ఇప్పుడు కార్డు ధర తగ్గించడంతో వాటి అమ్మకాలు, వినియోగం కూడా మరింత పెరిగే అవకాశం ఉంది.