నిజామాబాద్‌ ఎన్నికలపై పిటిషన్

నిజామాబాద్‌లో నామినేషన్లు దాఖలు చేసిన రైతులు ఎన్నికలు వాయిదా వేయాలంటూ గురువారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఎన్నికల ప్రచారం గడువు ముగిసేందుకు ఇంకా 5 రోజులు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇంతవరకు తమకు ఎన్నికల గుర్తులు కేటాయించక పోవడంతో తాము ఎన్నికల ప్రచారం చేసుకోలేకపోతున్నామని పిటిషనులో పేర్కొన్నారు. 185 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నప్పటికీ ఈవీఎంల ద్వారానే పోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించిందని, దాని వలన తమ వంటి గుర్తింపులేని అభ్యర్ధులకు అన్యాయం జరుగుతుందని కనుక బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించాలని వారు కోరారు. తమకు ప్రచారం చేసుకొనేందుకు, బ్యాలెట్ పేపర్లను ముద్రించడానికి వీలుగా నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికలను ఏప్రిల్ 18వ తేదీన జరిగే రెండవదశ ఎన్నికలతో కలిపి నిర్వహించాలని వారు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. రైతుల పిటిషన్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. భోజన విరామం అనంతరం దీనిపై తీర్పు చెప్పే అవకాశం ఉంది.