కొడంగల్‌లో చెల్లని నోటు...మల్కాజ్‌గిరీలో చెల్లుతుందా?

తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ బుదవారం మల్కాజ్‌గిరి లోక్‌సభ పరిధిలోగల కుత్బుల్లాపూర్, మేడ్చల్, సికిందరాబాద్‌లో విలేజ్ ప్రాంతాలలో తెరాస అభ్యర్ధి మర్రి రాజశేఖర్ రెడ్డికి మద్దతుగా రోడ్ షోలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా ప్రజలనుద్దేశ్యించి మాట్లాడుతూ, “కొడంగల్‌లో చెల్లని నోటు మల్కాజ్‌గిరీలో చెల్లుతుందా?కొడంగల్‌ నా అడ్డా అని రేవంత్‌ రెడ్డి గొప్పలు చెప్పుకొంటే, కొడంగల్‌ ప్రజలు ఆయనను చిత్తుకాగితాన్ని తీసిపడేసినట్లు తీసి పక్కన పడేశారు. అక్కడ ప్రజల చేత తిరస్కరించబడిన రేవంత్‌ రెడ్డి ఇక్కడకు వచ్చి పోటీ చేస్తున్నారు. ఎగిరెగిరి పడుతున్నారు. ఓటుకు నోటు కేసులో డబ్బు మూటలతో అడ్డంగా దొరికిపోయిన దొంగ రేవంత్‌ రెడ్డి. ఆయనకు ఓటు వేస్తారో లేక యువకుడు, విద్యావేత్త అయిన మర్రి రాజశేఖర్ రెడ్డికి ఓటు వేస్తారో మీరే నిర్ణయించుకోవాలి. రేవంత్‌ రెడ్డికి ఓటు వేయడమంటే మీ ఓట్లను వృధా చేసుకోవడమే. అదే విద్యావేత్త అయిన తెరాస అభ్యర్ధి మర్రి రాజశేఖర్ రెడ్డికి వేసి గెలిపిస్తే ఆయన తెలంగాణ ప్రయోజనాల కోసం పార్లమెంటులో గట్టిగా మాట్లాడుతారు.

జాతీయపార్టీల అభ్యర్ధులమని గొప్పలు చెప్పుకొంటూ మీ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని చెపుతున్న కాంగ్రెస్‌, బిజెపి అభ్యర్ధులు పార్లమెంటులో వారి అధిష్టానాన్ని కాదని మాట్లాడగలరా? వారి అధిష్టానం ఉస్కో అంటే ఉస్కో...డిస్కో అంటే డిస్కో అన్నట్లు మాత్రమే వారు వ్యవహరించగలరు. తెలంగాణ సమస్యలపై పార్లమెంటులోనిర్భయంగా మాట్లాడలేనివారు, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణకు నిధులు, ప్రాజెక్టులు సాధించుకురాలేని వారిని ఎన్నుకొని ఏమి ప్రయోజనమో మీరే ఆలోచించాలి. కేవలం తెరాస ఎంపీలు మాత్రమే పార్లమెంటులోపల, బయటా కూడా కేంద్రప్రభుత్వంతో కోట్లాడి నిధులు, ప్రాజెక్టులు సాధించుకొని రాగలరు. కనుక 16 తెరాస అభ్యర్ధులను గెలిపించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది,” అని కేటీఆర్‌ అన్నారు.