వాళ్ళు డిల్లీకి గులాములు...

సిఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచారానికి వస్తున్నారంటే కాంగ్రెస్‌, బిజెపిలపై నిప్పుల వర్షం కురిసినట్లే. మంగళవారం వరంగల్, భువనగిరిలో నిర్వహించిన తెరాస ఎన్నికల ప్రచారసభలలో కూడా ఆ రెండు పార్టీలపై నిప్పుల వర్షం కురిపించారు. గత 5 ఏళ్ళలో మోడీ హయాంలో దేశంలో జరిగిన అభివృద్ధి ఎంత? బిజెపి, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో జరిగిన అభివృద్ధి ఎంత? తన హయాంలో తెలంగాణలో ఎంత అభివృద్ధి జరిగిందో చర్చకు రావాలని కేసీఆర్‌ కాంగ్రెస్‌, బిజెపిలకు సవాలు విసిరారు. రాష్ట్రంలో జరిగిన, జరుగబోతున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించి, దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఈస్థాయిలో పనులు జరుగుతున్నాయా? అని ప్రశ్నించారు.

స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్‌, బిజెపిల అసమర్ధత, అలసత్వం కారణంగా నేటికీ దేశంలో సగం రాష్ట్రాలలో విద్యుత్ వంటి మౌలికసదుపాయలు లేవని, దళితులు, బడుగుబలహీన వర్గాల ప్రజలు బీదరికంలో మగ్గుతున్నారని, దేశంలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయాయని సిఎం కేసీఆర్‌ విమర్శించారు. అందుకే దేశ రాజకీయాలలో, వ్యవస్థలలో గుణాత్మకమైన మార్పు తీసుకువచ్చి, దేశాన్ని చక్కదిద్దాలనే ఆలోచనతోనే తాను జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించాలనుకొంటున్నాను తప్ప ప్రధానమంత్రి అవ్వాలనే కోరికతో కాదని కేసీఆర్‌ చెప్పారు. 

తెలంగాణ రాష్ట్రం దేశానికి మార్గదర్శనం చేసే సమయం ఆసన్నమైందని, 16 మంది తెరాస ఎంపీలను గెలిపిస్తే ఇతర పార్టీలతో కలిసి సమస్యలన్నిటినీ చక్కదిద్దుతానని సిఎం కేసీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌, బిజెపి ఎంపీలు డిల్లీలో వారి అధిష్టానానికి బానిసలు వంటివారు..వారి అధిష్టానం సిట్ అంటే వారు కూర్చోవాలి స్టాండ్ అంటే లేచి నిలబడాలి... తెలంగాణ రాష్ట్ర సమస్యల గురించి వారు పార్లమెంటులో నిర్భయంగా మాట్లాడలేరు. కనుక తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా కొట్లాడే తెరాస అభ్యర్ధులనే ఎంపీలుగా ఎన్నుకోవాలని సిఎం కేసీఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.