దానికి దశాబ్ధం గడువు తప్పదేమో?

కాంగ్రెస్‌ పార్టీ ఆకర్షణీయమైన ఎన్నికల మేనిఫెస్టోను మంగళవారం విడుదల చేసింది. దాని గురించి క్లుప్తంగా చెప్పుకోవాలంటే షరా మామూలుగా పేదరికం, నిరుద్యోగ నిర్మూలన, విద్యా, వైద్యం, వ్యయసాయం, మౌలికవసతుల  అభివృద్ధి తదితర అంశాలున్నాయి. వాటిలో న్యాయ్ పధకం ద్వారా పేదకుటుంబాలకు నెలకు రూ.6,000 చొప్పున ఏడాదికి రూ.72,000 చెల్లిస్తామనేది ఎన్నికల తాయిలంగా చెప్పుకోవచ్చు. 2030 నాటికల్లా దేశంలో పేదరికం నిర్మూలిస్తామని కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. దేశప్రజల సమస్యలు, అవసరాలు, దేశ ఆర్ధిక పరిస్థితి వంటివన్నీ పరిగణనలోకి తీసుకొని వాస్తవాలకు దగ్గరగా ఆచరణ సాధ్యమైన మేనిఫెస్టోను రూపొందించామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకొంది. 

స్వర్గీయ ఇందిరాగాంధీ ‘గరీబీ హటావో’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చారు. ఆ తరువాత అనేక దశాబ్ధాలపాటు కాంగ్రెస్ పార్టీయే దేశాన్ని, రాష్ట్రాలను ఏకఛత్రాధిపత్యంగా పాలించింది. కానీ నేటికీ దేశంలో పేదరికం పోలేదు పైగా ఇంకా పెరిగిపోయింది. ఇప్పుడు ఆమె మనుమడు రాహుల్ గాంధీ తనకు అధికారం ఇస్తే 2030 నాటికి పేదరికాన్ని నిర్మూలిస్తామని చెపుతున్నారు. పేదరికం, నిరుద్యోగం, వ్యవసాయ సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ దశాబ్ధం గడువు తప్పదేమో?