అప్పుడే కేసీఆర్‌ సచివాలయానికి వస్తారు: లక్ష్మణ్

పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయపార్టీల విమర్శలు, ప్రతివిమర్శలతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కిపోతోంది. ప్రధాని నరేంద్రమోడీ, సిఎం కేసీఆర్‌ శుక్రవారం ఎన్నికల ప్రచారసభలలో ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకోగా వాటికి కొనసాగింపుగా రాష్ట్ర నేతలు కూడా పరస్పరవిమర్శలు చేసుకొంటూ ఎన్నికలవేడిని మరింత పెంచుతున్నారు. 

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె లక్ష్మణ్ శనివారం హైదరాబాద్‌ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “ఎమ్మెల్సీ ఎన్నికలలో మూడు చోట్ల తెరాస ఓడిపోయిన తరువాతే సిఎం కేసీఆర్‌కు రైతులు జ్ఞాపకం వచ్చారు. ఇప్పుడు రైతుల సమస్యల గురించి మాట్లాడుతున్నారు. 

ఆయన తనంతట తానుగా ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికలలో తెరాస ఓడిపోతే తెలంగాణ రాష్ట్రం చంద్రబాబునాయుడు చేతిలోకి వెళ్ళిపోతుందని ప్రజలను భయపెట్టి గెలిచారు. గెలిచిన మూడు నెలల వరకు మంత్రివర్గం ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు చేసినా దానిలో ఒక్క మహిళకు కూడా స్థానం కల్పించలేదు. కేసీఆర్‌ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోలేరు కానీ లోక్‌సభ ఎన్నికలలో 16 ఎంపీ సీట్లు ఇస్తే డిల్లీలో చక్రం తిప్పుతామని నమ్మబలుకుతున్నారు. 

తెరాసను 16 ఎంపీ స్థానాలలో ఓడించినప్పుడే కేసీఆర్‌ తన ఫాంహౌసులో నుంచి బయటకు వచ్చి సచివాలయానికి వస్తారు. గత 5 ఏళ్ళుగా ఏమీ చేయలేకపోయిన తెరాసకు 16ఎంపీ సీట్లు ఇస్తే ఇప్పుడు మాత్రం ఏమి సాధించగలదు? కేవలం నరేంద్రమోడీ మాత్రమే ఈ దేశాన్ని అభివృద్ధిపధంలో నడిపించగలరు. కనుక కేంద్రంలో సుస్థిరమైన, నీతివంతమైన ప్రభుత్వం ఏర్పడాలంటే బిజెపి అభ్యర్ధులకే ఓట్లు వేసి గెలిపించాలి,” అని అన్నారు.