హరీష్‌రావు ఎన్నికల ప్రచారంలో అగ్ని ప్రమాదం

మెదక్‌ జిల్లాలోని తూప్రాన్‌లో శుక్రవారం రాత్రి హరీష్‌రావు తదితర తెరాస నేతలు ఎన్నికల ప్రచారం చేస్తుండగా అగ్ని ప్రమాదం జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఎవరూ ఈ ప్రమాదంలో గాయపడలేదు. హరీష్‌రావు ఉపయోగిస్తున్న ఎన్నికల ప్రచారవాహనం నిన్న రాత్రి 8 గంటలకు తూప్రాన్‌ మున్సిపల్  కార్యాలయం వద్దకు చేరుకొన్నప్పుడు, దాని  వెనుకనే వస్తున్న జనరేటరులో డీజిల్ కారిపోవడంతో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో హరీష్‌రావు తన వాహనంలో నిలబడి ప్రసంగిస్తున్నారు. జనరేటరు వెనుక వస్తున్న మరికొన్ని వాహనాలలో తెరాస నేతలున్నారు. ఇది గమనించి హరీష్‌రావుతో సహా అందరినీ స్థానిక కార్యకర్తలు వాహనాలలో నుంచి దించి దూరంగా తీసుకువెళ్లారు. ఆ లోగా స్థానిక ప్రజలు, కార్యకర్తలు అందరూ కలిసి బకెట్లతో నీళ్ళు తెచ్చి పోసి మంటలను ఆర్పివేశారు. అగ్నిప్రమాదం జరిగినప్పుడు హరీష్‌రావుతో పాటు ప్రతాప్‌రెడ్డి, చెరకు ముత్యంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, భూంరెడ్డి, భూపతిరెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. కానీ అదృష్టవశాత్తు అందరూ సురక్షితంగా బయటపడ్డారు.