బిజెపిలో చేరిన జయప్రద

అలనాటి ప్రముఖ తెలుగు సినీ నటి జయప్రద మంగళవారం బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, “నేను సినిమాలలోనైనా రాజకీయాలలోనైనా మనస్ఫూర్తిగా పనిచేస్తాను. అందుకే రెండు రంగాలలో నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోగలిగాను. దేశాన్ని అభివృద్ధి చేయాలని తపిస్తున్న నరేంద్రమోడీ వంటి గొప్ప నాయకుడి నేతృత్వంలో నాకు పనిచేసే అదృష్టం లభించడం గౌరవంగా భావిస్తున్నాను. ఇక నుంచి బిజెపి కోసం అదే చిత్తశుద్ధితో పనిచేస్తాను,” అని అన్నారు. 

జయప్రద 1994లో మొదటిసారిగా తెలుగుదేశంలో చేరి రాజకీయాలలోకి ప్రవేశించారు. ఆ తరువాత యూపీలోని సమాజ్‌వాదీ పార్టీలోకి మారి రామ్ పూర్ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. కానీ ఆ పార్టీతో సమస్యలు ఏర్పడటంతో బయటకువచ్చేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికలలో మళ్ళీ ఏపీ రాజకీయాలలోకి ప్రవేశించాలనుకొన్నారు కానీ సాధ్యపడలేదు. ఈసారి లోక్‌సభ ఎన్నికల సమయంలో బిజెపి నేతలతో చర్చలు జరిపి ఆ పార్టీలో చేరారు. ఆమెను రాంపూర్ నుంచి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ఆజంఖాన్‌పై పోటీకి దింపాలని బిజెపి భావిస్తోంది.