కేసీఆర్‌, కేటీఆర్‌ ఎన్నికల ప్రచారసభల షెడ్యూల్

ఇప్పటికే సిఎం కేసీఆర్‌, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఎన్నికల సన్నాహక సమావేశాలు, ప్రచార సభలలో పాల్గొంటున్నారు. ఈనెల 28న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే ఇరువురూ మళ్ళీ వరుసగా ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తారు. 

సిఎం కేసీఆర్‌ షెడ్యూల్: 

మొదటిసభ మార్చి 28న ఉంటుంది. అది ఎక్కడ నిర్వహిస్తారో ఇంకా నిర్ణయించవలసి ఉంది. ఆ తరువాత వరుసగా మార్చి 29న నల్గొండ, మార్చి 31న మహబూబ్‌నగర్‌, ఏప్రిల్ 1న మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలో బహిరంగసభలలో పాల్గొంటారు. ఏప్రిల్ 9 సాయంత్రం 5గంటల వరకు ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చు కనుక ఆలోగా మిగిలిన నియోజకవర్గాలలో కూడా బహిరంగసభలు నిర్వహిస్తారు. వాటి షెడ్యూల్ ఇంకా ఖరారు కావలసి ఉంది. 

కేటీఆర్‌ షెడ్యూల్: 

ఈనెల 30 నుంచి ఏప్రిల్ 2వరకు సికిందరాబాద్‌, ఏప్రిల్ 3 నుంచి 6వరకు మల్కాజ్‌గిరి, ఏప్రిల్ 7 నుంచి 9వరకు చేవెళ్ళలో రోడ్ షోలు, సభలు నిర్వహించబోతున్నారు. 

మల్కాజ్‌గిరి నుంచి రేవంత్‌ రెడ్డి, చేవెళ్ళ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సికిందరాబాద్‌ నుంచి అంజని కుమార్ యాదవ్ కాంగ్రెస్‌ అభ్యర్ధులుగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సికిందరాబాద్‌ నుంచి బిజెపి తరపున కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వీరందరూ చాలా బలమైన అభ్యర్ధులే కనుక ఈ మూడు నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారానికి కేటీఆర్‌ ఎక్కువ సమయం కేటాయించినట్లు భావించవచ్చు. ముఖ్యంగా మల్కాజ్‌గిరి, చేవెళ్ళ నుంచి పోటీ చేస్తున్న రేవంత్‌ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలను ఓడించడమే లక్ష్యంగా కేటీఆర్‌ పనిచేయబోతున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. 

సికిందరాబాద్‌ నుంచి మంత్రి తలసాని కుమారుడు తలసాని సాయి కిరణ్, మల్కాజ్‌గిరి నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డి, చేవెళ్ళ నుంచి రంజిత్ రెడ్డి తెరాస అభ్యర్ధులుగా పోటీ చేస్తున్నారు.