
ఒడిశాలోని అధికార బిజెడి అధినేత, సిఎం నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయం తీసుకొన్నారు. వచ్చే నెలలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలో 33 శాతం సీట్లు మహిళలకే కేటాయిస్తామని ప్రకటించారు. ఒడిశాలో మొత్తం 21 లోక్‌సభ స్థానాలున్నాయి. వాటిలో 33 శాతం అంటే 6 లేదా 7 సీట్లు మహిళలకు కేటాయించబోతున్నారన్న మాట. ఒడిశాలోని కేంద్రపఢాలో ఆదివారం మహిళా స్వయం సహాయ బృందాల సమావేశంలో పాల్గొన్న సిఎం నవీన్ పట్నాయక్ ఈ సంచలన ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మహిళా సాధికారత సాధించాలంటే వారికి అన్ని రంగాలలో సమానావకాశాలు కల్పించాలి. అమెరికా, చైనా వంటి దేశాలు మహిళలకు పురుషులతో సమానంగా అవకాశాలు కల్పించాయి కనుకనే అవి ప్రపంచంలో నెంబర్: 1 స్థాయికి ఎదిగాయి. భారత్ కూడా ఆ స్థాయికి ఎదగలంటే తప్పనిసరిగా రాజకీయాలలో కూడా మహిళలకు సమానావకాశాలు కల్పించాలి. ఆ ఆలోచనతోనే మా బిజూ జనతా దళ్ పార్టీ తరపున 6-7 మంది మహిళలను లోక్‌సభకు పంపిస్తున్నాము,” అని అన్నారు.
మహిళా సాధికారత, చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి అంటూ కాంగ్రెస్, టిడిపి, తెరాసవంటి పార్టీలు వృధాప్రసంగాలతో కాలక్షేపం చేస్తుంటే నవీన్ పట్నాయక్ దానిని ఆచరణలో పెట్టి చూపిస్తున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ-11 మందికి, తెరాస-4(4.7 శాతం), టిడిపి-1 స్థానాలను మహిళలకు కేటాయించాయి. గత తెలంగాణ ప్రభుత్వంలో ఒక్క మహిళా కూడా మంత్రి లేరు. ఈసారి ఇద్దరు మహిళలకు మంత్రిపదవులు ఇస్తామని సిఎం కేసీఆర్ ప్రకటించారు. త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్, తెరాస, టిడిపి, బిజెపి, వైకాపా, జనసేన, వామపక్షాలు మహిళకు ఎన్ని సీట్లు కేటాయిస్తాయో చూడాలి.