కేటీఆర్‌ను కలిసిన సబితా ఇంద్రారెడ్డి

సీనియర్ కాంగ్రెస్‌ నేత, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇంట్లో తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అయ్యారు. చేవెళ్ళ లోక్‌సభ స్థానాన్ని తన కుమారుడు కార్తీక్ రెడ్డికి ఇస్తే తాను, తన కుమారుడితోపాటు తమ అనుచరులందరూ తెరాస చేరేందుకు సిద్దంగా ఉన్నామని కేటీఆర్‌కు తెలిపారు. ఆమె ప్రతిపాదనకు కేటీఆర్‌ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే చేవెళ్ళ స్థానం గురించి సిఎం కేసీఆర్‌తో చర్చించి తెలియజేస్తానని హామీ ఇచ్చారు. 

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది. నామినేషన్లు వేయడానికి ఈనెల 25 వరకు గడువు ఉంది కనుక త్వరలోనే అభ్యర్ధుల పేర్లను ప్రకటించవలసి ఉంది. కనుక నేడో రేపో చేవెళ్ళ లోక్‌సభ టికెట్ పై సిఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవచ్చు.  

చేవెళ్ళకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెరాస ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడంతో తెరాసలో ఆ స్థానం ఖాళీ అయ్యింది. దాని కోసం తెరాసలో గట్టి పోటీ ఉన్నప్పటికీ  ఆ స్థానాన్ని కార్తీక్ రెడ్డికి కేటాయించినట్లయితే సబితా ఇంద్రారెడ్డితో సహా వారి అనుచరులు అందరూ తెరాసలో చేరడానికి సిద్దంగా ఉన్నారు కనుక చేవెళ్ళలో తెరాసకు రాజకీయంగా బలం పెరుగుతుంది. అయితే కార్తీక్ రెడ్డికి టికెట్ ఇస్తే అతను కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేయబోతున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డిని డ్డీకొని ఓడించగలరా లేదా? అని ఆలోచించవలసి ఉంటుంది. తప్పకుండా గెలుస్తారని సిఎం కేసీఆర్‌ భావించినట్లయితే చేవెళ్ళ టికెట్ కార్తీక్ రెడ్డికే  కేటాయించవచ్చు. కేటాయిస్తే సబితా ఇంద్రారెడ్డి అండ్ ఫ్యామిలీ కీలకమైన ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇచ్చేసి తెరాసలో చేరిపోవడం ఖాయం.