టి-కాంగ్రెస్‌లో మరో వికెట్ పడింది

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారమే శంషాబాద్‌లో లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించి వెళ్లారు. ఆయన వచ్చిన రోజునే నకిరేకల్ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పార్టీని వీడి తెరాసలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావులు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి తెరాసలో చేరబోతున్నట్లు ప్రకటించారు.

తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే హరీప్రియా నాయక్ కూడా కాంగ్రెస్ పార్టీని వీడి తెరాసలో చేరబోతున్నట్లు ఆదివారం ప్రకటించారు. తన నియోజకవర్గం అభివృద్ధి కోసమే తెరాసలో చేరబోతునట్లు ప్రకటించారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెరాస టికెట్ పై మళ్ళీ పోటీ చేసేందుకు సిద్దమని ఆమె చెప్పారు.

మాజీ హోంమంత్రి, చేవెళ్ళ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీని వీడి తెరాసలో చేరబోతునట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఫిరాయింపుల జోరు చూస్తుంటే లోక్‌సభ ఎన్నికలలోగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈసారి తెరాసలో చేరబోతున్న కాంగ్రెస్‌, టిడిపి ఎమ్మెల్యేలు అందరూ “అవసరమైతే తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి మళ్ళీ తెరాస బీ-ఫారంపై పోటీ చేస్తామని” చెపుతుండటం గమనిస్తే, ఇకపై ఫిరాయింపు ఎమ్మెల్యేల వలన తెరాసకు అప్రదిష్ట, విమర్శలు, న్యాయపోరాటాలు సిఎం కేసీఆర్‌ వద్దనుకొంటునందునే వారు ఈవిధంగా చెపుతున్నారనుకోవలసి ఉంటుంది.