
ప్రముఖ హాస్యనటి కోవై సరళ ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించారు. కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యమ్(ఎంఎన్ఎం) పార్టీలో శుక్రవారం చేరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “తమిళనాడును ఒక మహిళా ముఖ్యమంత్రి చిరకాలం పరిపాలించినప్పటికీ రాష్ట్రంలో మహిళలు అణచివేతకు గురయ్యారు. రాజకీయాలలో మహిళలకు సముచిత స్థానం లభించలేదు. ఎంఎన్ఎం పార్టీలో మహిళలకు సముచిత స్థానం, ప్రాధాన్యఠ లభిస్తుందని ఆశిస్తున్నాను,” అని అన్నారు.
కమల్ హాసన్ మాట్లాడుతూ, “మహిళలను గౌరవించాలనే విషయం నాకు నా చిన్నప్పటి నుంచే నా తల్లితండ్రుల దగ్గర నేర్చుకొన్నాను. కనుక మా పార్టీలో మహిళలకు సముచిత స్థానం, గౌరవం రెండూ లభిస్తాయని నేను హామీ ఇస్తున్నాను. మహిళలు అన్ని రంగాలలో ప్రవేశిస్తున్నప్పటికీ రాజకీయాలలో ప్రవేశించడానికి అయిష్టత చూపుతుంటారు. నా సహ నటి కోవై సరళ మా పార్టీ ద్వారా రాజకీయాలలోకి ప్రవేశించడం నాకు చాలా ఆనందం కలిగిస్తోంది,” అని అన్నారు.
సినీ పరిశ్రమ నుంచి చాలా మంది రాజకీయాలలో ప్రవేశిస్తుంటారు. వారిలో మూడు రకాలవారుంటారు. ఎన్నికలు దగ్గర పడినప్పుడు రాజకీయాలలో ప్రవేశించి అదృష్టం పరీక్షించుకొని కుదరకపోతే మళ్ళీ సినీపరిశ్రమలోకి వెళ్ళిపోయేవారు ఒక రకం అయితే ఏదో ఓ పార్టీ టికెట్ సంపాదించుకొని ఎన్నికలలో పోటీ చేసి గెలిస్తే అటు సినిమాలు చేసుకొంటూ పార్ట్-టైమ్ రాజకీయాలు చేసుకొనేవారు రెండో రకం. ఇక మూడోరకంలో సినీ పరిశ్రమకు గుడ్ బై చెప్పేసి పూర్తి సమయం రాజకీయాలలో ఉండాలనుకొనేవారు మూడో రకం.
ఆలీ, కోవై సరళ, పృద్విరాజ్ వంటి నటులు మొదటిరకం కాగా, బాలకృష్ణ, చిరంజీవి వంటివారు రెండో రకానికి చెందిన పార్ట్-టైమ్ రాజకీయనాయకులు. పవన్‌కల్యాణ్, కమల్ హాసన్ వంటివారు మూడో రకానికి చెందినవారు. వారిలో మొదటి రకానికి చెందిన నటీనటులు రాజకీయాల పట్ల ఆసక్తి కారణంగానో లేదా రాజకీయ నాయకులతో తమకున్న పరిచయాల కారణంగా వారి అభ్యర్ధించడం చేతనో ఎన్నికలకు ముందు వచ్చి హడావుడి చేస్తుంటారు. కోవై సరళకు లోక్‌సభ టికెట్ లభించే అవకాశం లేదు కనుక ఆమె ఎన్నికలు ముగియగానే ఆమె మళ్ళీ సినిమాలలోకి వెళ్లిపోవచ్చు.