కేటీఆర్‌ వెర్సస్ హరీష్‌రావు?

ఈరోజు మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గం సన్నాహక సభలో తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, తెరాస ఎమ్మెల్యే హరీష్‌రావు ఒకరికొకరు సవాళ్ళు విసురుకొన్నారు. కేటీఆర్‌ మాట్లాడుతూ, “ఇప్పుడు మనకు కాంగ్రెస్‌, బిజెపిలతో పోటీ లేదు కనుక మనలో మనమే పోటీ పడాలి. మనం ఇప్పుడు ఒక నియోజకవర్గంపై మరో నియోజకవర్గం ఎంత మెజార్టీ సాధిస్తామనే దానిపై పోటీ పడాలి. కనుక కరీంనగర్‌ కంటే మెదక్‌ నియోజకవర్గం ఎక్కువ మెజార్టీ సాధించి సిఎం కేసీఆర్‌కు మనం బహుమానంగా అందించాలి,” అని అన్నారు. అప్పుడు పక్కనే ఉన్న హరీష్‌రావు స్పందిస్తూ, “కరీంనగర్‌ నియోజకవర్గం కంటే ఎక్కువ మెజార్టీ సాధించి చూపండి. మీ నియోజకవర్గం కంటే మేమే కనీసం ఒక్క ఓటయినా ఎక్కువ సాధించి చూపుతాం,” అని ప్రతి సవాలు విసిరారు. దానికి కేటీఆర్‌ మళ్ళీ స్పందిస్తూ నా సవాల్ మా బావతో కాదు.  ఈ ఎన్నికలు ఏకపక్షమే కనుక ఏ నియోజకవర్గం ఎంత మెజారిటీ సాధిస్తామనే పోటీ మాత్రమే,” అని అన్నారు.