టి-కాంగ్రెస్‌లో మరో వికెట్ పడింది

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ ఎమ్మెల్యేలే వరుసగా షాకులు ఇస్తున్నారు. కోమటిరెడ్డి సోదరులకు అత్యంత సన్నిహితుడుగా పేరున్న నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య త్వరలో తెరాసలో చేరిపోబోతున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి ద్వారా సిఎం కేసీఆర్‌తో  మాట్లాడినట్లు సమాచారం. కోమటిరెడ్డి సోదరులకు ఈ విషయం తెలిస్తే వారు తనను తెరాసలో చేరకుండా అడ్డుకొనే ప్రయత్నం చేస్తారనే ఆలోచనతో చిరుమర్తి లింగయ్య తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్నాతంలోకి వెళ్ళిపోయారు. కనుక ఏ క్షణంలోనైనా ఆయన తెరాస గులాబీ కండువా కప్పుకోవడం ఖాయమనే భావించవచ్చు. ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ అనే చెప్పాలి.  

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తప్పకుండా గెలిచి అధికారంలోకి వస్తామని భావించిన కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అక్కడితో దాని ఓటమి పూర్తికాలేదు. ఎమ్మెల్యేల ఫిరాయింపులు కారణంగా ఎమ్మెల్సీ సీటును దక్కించుకోలేని దుస్థితిలో ఉంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్టీలో బలమైన ఎమ్మెల్యేలు వరుసగా తెరాసలోకి వెళ్ళిపోతుండటంతో పార్టీపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం కనిపిస్తోంది.