మార్చి 10న ఎన్నికల షెడ్యూల్ ప్రకటన?

నేడో రేపో కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ, ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించబోతోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత ప్రజలను ప్రభావితం చేసే ఎటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోకూడదు. కనుక ఎన్నికల ప్రకటన వెలువడక మునుపే ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన నేడు కేంద్రమంత్రివర్గ సమావేశం కానుంది. మోడీ మంత్రివర్గానికి ఇదే చివరి సమావేశం కనుక దేశ ప్రజలను ఆకట్టుకొనేందుకు ఈ సమావేశంలో ఏవైనా వరాలు ప్రకటించే అవకాశం ఉంది. 

సాధారణంగా ప్రతీ శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘంలో ముగ్గురు సభ్యులు సమావేశమవుతుంటారు. కానీ ప్రధాని నరేంద్రమోడీ శనివారం ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేయనున్నారు. ఆ రెండు రాష్ట్రాలకు ఆయన పర్యటనలు, కార్యక్రమాలు ఇప్పటికే ఖరారు అయ్యాయి. కనుక రేపు ఎన్నికల ప్రకటన చేస్తే అటువంటి కార్యక్రమాలలో ప్రధాని మోడీ పాల్గొనలేరు. అంటే అవి పూర్తయిన తరువాత మార్చి 10న ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం ఉందని భావించవచ్చు.