
ఈరోజు మధ్యాహ్నం నల్గొండ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. దానిలో 8మంది ఘటనా స్థలంలోనే మృతి చెందారు. దేవరకొండ నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న టాటా ఏస్ వాహనం కొండమల్లేపల్లి మండలం దేవతుపల్లి వద్ద అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును బలంగా డీకొనడంతో టాటా ఏస్ వాహనం ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. ఆ ధాటికి డ్రైవరుతో సహా వాహనంలో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రయాణికులు ఘటనాస్థలంలోనే మృతి చెందారు. మరొకరిని ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే చనిపోయారు. మరో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పోలీసులు వారిని దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని శవాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుల పేర్లు: మహేశ్ (డ్రైవర్), గోవర్ధన్, ఆకుల శ్రీను, నీలా వెంకటేశ్వరులు, మరొక వ్యక్తి, ముగ్గురు మహిళలు ఉన్నారు. టాటా ఏస్ వాహనం టైరు పేలిపోవడం వలన ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.