
తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు కరీంనగర్లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్, బిజెపి రెండూ పూర్తి మెజారిటీ సాధించలేవని అనేక సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 150-160 సీట్లు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే కూటమికి 100-110 సీట్లు మాత్రమే వస్తాయని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో లోక్సభ ఎన్నికల తరువాత ఫెడరల్ ఫ్రంట్ కేంద్రంలో కీలకపాత్ర పోషించే అవకాశం లభించబోతోంది. రాష్ట్ర ప్రజలు 16ఎంపీ స్థానాలలో తెరాసను గెలిపించినట్లయితే, ఫెడరల్ ఫ్రంట్లో భావస్వారూప్యత కలిగిన పార్టీల నుంచి కనీసం 70-100 మంది ఎంపీలతో కలిసి ప్రధానమంత్రి కుర్చీలో ఎవరు కూర్చోవాలో నిర్ణయించగలుగుతాము. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా వంటివన్నీ సాధించుకోగలుగుతాము. కనుక తెలంగాణ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి తెరాసకు 16 ఎంపీ సీట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.