గుబులు పుట్టిస్తున్న డ్రోన్ల హడావుడి

మొన్న గుజరాత్, ఆ తరువాత రాజస్థాన్ సరిహద్దుల వద్ద...సోమవారం చెన్నైలోని నావికాదళ కేంద్రంవద్ద గుర్తు తెలియని డ్రోన్లు గాలిలో సంచరిస్తూ అధికారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. రాజస్థాన్ లోని బికనీర్ వద్ద డ్రోన్ సంచరిస్తుండటాన్ని గుర్తించిన వాయుసేన వెంటనే దానిని కూల్చి వేసింది. 

సోమవారం రాత్రి సుమారు 9గంటల సమయంలో చెన్నైలోని ఐఎన్‌ఎస్‌ (అడయార్‌ క్యాంపస్‌) పై గుర్తు తెలియని డ్రోన్ కాసేపు సంచరించి వెళ్లిపోయింది. ఐఎన్‌ఎస్‌ అధికారులు వెంటనే పోలీసులకు తెలియబరచడంతో వారు హుటాహుటిన అక్కడకు చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. 

ఇటీవల పెళ్ళిళ్ళు శుభకార్యాలలో డ్రోన్ కెమెరాల వాడకం పెరిగిపోయింది. కనుక నగరం నడిబొడ్డున ఉన్న అడయార్ పరిసర ప్రాంతాలలో సోమవారం రాత్రి పెళ్ళిళ్ళు, శుభకార్యాలు ఏమైనా జరిగాయా? వాటికి సంబందించిన డ్రోన్ పొరపాటున ఐఎన్‌ఎస్‌ క్యాంపస్ వైపు వచ్చిందా లేక సంఘ విద్రోహశక్తులు ఎవరైనా డ్రోన్ కెమెరాతో క్యాంపస్ ను చిత్రీకరించే ప్రయత్నం చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.