మణుగూరులో కాంగ్రెస్‌ వెర్సస్ రేగా అనుచరులు

పినపాక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రేగా కాంతారావు పార్టీని వీడి తెరాసలో చేరబోతుండటాన్ని నిరసిస్తూ స్థానిక కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు మంగళవారం ఉదయం మణుగూరులోని పార్టీ కార్యాలయానికి చేరుకొని లోనికి ప్రవేశించబోతే, రేగా కాంతారావు అనుచరులు వారిని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కాసేపు ఇరువర్గాల మద్య తోపులాటలు, తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం స్థానిక కాంగ్రెస్‌ నేతలు మీడియాతో మాట్లాడుతూ రేగా కాంతారావు తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రేగా రాజకీయ ఎదుగుదలకు కారణమైన కాంగ్రెస్‌ పార్టీకి వెన్నుపోటు పొడిచి, స్వార్ధప్రయోజనాల కోసం తెరాసలో చేరుతున్నారని ఆరోపించారు. రేగా కాంతారావు తన పదవికి రాజీనామా చేసేవరకు తమ పోరాటం కొనసాగిస్తాంని చెప్పారు.         

మరోపక్క ఖమ్మం జిల్లా టిడిపి అధ్యక్షుడు తుళ్ళూరి బ్రహ్మయ్య కూడా రేగా కాంతారావుపై విరుచుకుపడ్డారు. “ఉపాధ్యాయుడిగా గౌరవప్రదమైన ఉద్యోగం చేసిన ఆయన ఆదివాసీల సమస్యల పరిష్కారించడం కోసమే తెరాసలో చేరుతున్నానని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఆయన తెరాసలో చేరాలనుకొంటే ముందుగా కూటమి ద్వారా గెలుచుకొన్న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము,” అని అన్నారు.