అందుకే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు: పొన్నం ప్రభాకర్‌

కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ సోమవారం శివరాత్రి సందర్భంగా వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం కైలాస కల్యాణి క్షేత్రంలో ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “తెరాసకు 90మంది ఎమ్మెల్యేలున్నప్పటికీ తన మేనల్లుడు హరీష్ రావు లేదా కుమారుడు కేటీఆర్‌లలో ఎవరో ఒకరు తన ప్రభుత్వాన్ని కూల్చివేస్తారనే  అభద్రతాభావంలో కేసీఆర్‌ ఉన్నారు. అటువంటి ప్రమాదం ఏర్పడితే ఇతర పార్టీల నుంచి తెచ్చుకొన్న ఎమ్మెల్యేలతో తన పదవి, అధికారం కాపాడుకోవాలని ముందు జాగ్రత్తపడుతున్నారు,” అని అన్నారు. 

సిఎం కేసీఆర్‌కు పార్టీలో ఎవరి నుంచి అటువంటి సమస్య లేదని పొన్నం ప్రభాకర్‌కు కూడా తెలుసు. పైగా లోక్‌సభ ఎన్నికల తరువాత కేసీఆర్‌ జాతీయరాజకీయాలలోకి ప్రవేశించాలని భావిస్తున్నారు కనుక తానే స్వయంగా కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పదవిని అప్పజెప్పి డిల్లీ వెళ్ళవచ్చు. మంచి సమర్ధుడైన హరీష్ రావుకు కేసీఆర్‌ మంత్రిపదవి ఇవ్వకపోవడానికి బలమైన కారణమే ఉంటుంది. ఆయనను లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయించి కేంద్రమంత్రిగా చేయాలని లేదా లోక్‌సభ ఎన్నికల తరువాత రాష్ట్ర ప్రభుత్వంలోనే కీలకమైన పదవి కట్టబెట్టే ఆలోచన చేస్తుండవచ్చు. కనుక పొన్నం ప్రభాకర్‌ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి. 

మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెరాసలోకి ఎందుకు ఆకర్షించాలని సిఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారనే ప్రశ్నకు సమాధానం పొన్నంతో సహా అందరికీ తెలుసు. రాష్ట్రంలో తెరాసకు తిరుగులేకుండా చేసేందుకే కాంగ్రెస్ పార్టీని ఈవిధంగా రాజకీయంగా బలహీనపరుస్తున్నారనే సంగతి కాంగ్రెస్‌ నేతలకు కూడా తెలుసు. కనుక కేసీఆర్‌ అభద్రతాభావం గురించి ఊహాగానాలు చేస్తూ కాలక్షేపం చేసేబడులు కాంగ్రెస్ పార్టీని ఏవిధంగా కాపాడుకోవాలో ఆలోచిస్తే మంచిది కదా!