
యశ్వంత్ పూర్ నుంచి టాటానగర్ వెళుతున్న యశ్వంత్ పూర్-టాటానగర్ ఎక్స్‌ప్రెస్‌లోని ప్యాంట్రీ కారులో ఈరోజు తెల్లవారుజామున మంటలు అంటుకొన్నాయి. అదృష్టవశాత్తు పక్కబోగీలో కొందరు ప్రయాణికుళు మేల్కొని ఉండటంతో వారు వెంటనే చైన్ లాగి రైలును నిలిపివేశారు. వెంటనే రైల్లో ప్రయాణికులు అందరూ దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకొన్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకొని వెంటనే మంటలను ఆర్పివేయడంతో ఆస్తినష్టం కాకుండా అరికట్టగలిగారు. ఈ ప్రమాదం తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు సమీపంలో సుమారు 2.30 గంటలకు జరిగింది.
ప్రయాణికులు తెలిపిన సమాచారం ప్రకారం, ఇంజను నుంచి 9వ బోగీగా ఉన్న ప్యాంట్రీకారులో తెల్లవారుజామున మంటలు అంటుకొన్నాయి. రైలు కదులుతుండటంతో మంటలు శరవేగంగా ప్యాంట్రీకారుకు పక్కనే ఉన్నఎస్-1 బోగీకి వ్యాపించాయి. కానీ ప్రయాణికులు చైన్ లాగి రైలును నిలిపివేయడంతో మంటల ఉదృతి తగ్గిపోయింది. అయినప్పటికీ ఎస్-1బోగీలో రెండు టాయిలెట్లు దగ్ధం అయిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకోవడంతో మంటలు బోగీ అంతటికీ వ్యాపించకుండా నివారించగలిగారు. ఈ ప్రమాదానికి కారణం తెలియవలసి ఉంది. రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని అవసరమైన చర్యలు చేపట్టారు.