త్వరలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటన

లోక్‌సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఈనెల 7,8 తేదీలలో ప్రకటించే అవకాశం ఉంది. ఏ కారణం చేతైనా ఆరోజున వెలువడకపోతే 11,12 తేదీలలో తప్పకుండా ప్రకటించడం ఖాయమని తెలుస్తోంది. లోక్‌సభ గడువు 2019, మే 26తో ముగుస్తుంది. అలాగే సిక్కిం మే 27, అరుణాచల్ ప్రదేశ్ జూన్ 1, ఒడిశా జూన్ 11, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీల గడువు జూన్ 18తో ముగియనుంది. 

మార్చి 18వ తేదీన మొదటిదశ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించి ఏప్రిల్ 13 నుంచి లోక్‌సభ ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టి మే 15లోగా ముగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించినట్లు సమాచారం. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం మే 21-23 తేదీలలో చేసి మే 25న ఫలితాలు ప్రకటించవచ్చునని సమాచారం. 

యూపీ, బీహార్,మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ తదితర పెద్ద రాష్ట్రాలలో తప్ప ఏపీ, తెలంగాణతో సహా అన్ని చిన్న రాష్ట్రాలలో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం షెడ్యూల్ సిద్దం చేస్తున్నట్లు సమాచారం. 

జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు లేనందున, పరిస్థితులు చక్కబడిన తరువాత నిర్వహించే అవకాశం ఉంది.