
రాష్ట్రంలో మరో ప్రతిపక్ష ఎమ్మెల్యే తెరాసలో చేరబోతున్నారు. ఆయనే ఖమ్మం జిల్లా సత్తుపల్లి టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య. అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆయన తెరాసలో చేరబోతున్నారని మీడియాలో చాలా ఊహాగానాలు వినిపించాయి. కాస్త ఆలస్యం అయినప్పటికీ ఆ ఊహాగానాలను నిజమని దృవీకరిస్తూ తాను టిడిపిని వీడి త్వరలో తెరాసలో చేరబోతున్నట్లు ఆయనే స్వయంగా నిన్న ప్రకటించారు.
ఆదివారం తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్ర ప్రజలు తెరాసవైపే మొగ్గు చూపారు. టిడిపిని, మహాకూటమిని తిరస్కరించారు. రాష్ట్రంలో టిడిపి ఉనికి కోల్పోయింది. నా నియోజకవర్గంలో ప్రజలు, కార్యకర్తల అభిమతం మేరకు నేను తెరాసలో చేరాలని నిర్ణయించుకొన్నాను. టిడిపిలో ఉన్నంతకాలం నేను చాలా నిబద్దతతో పనిచేశాను. ఎటువంటి అవినీతి పనులకు పాల్పడకుండా జిల్లా అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేశాను. అందుకే ప్రజలు నాలుగుసార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. ప్రజలు నాపై ఉంచిన ఆ నమ్మకం, చూపిన ఆ అభిమానం కారణంగానే వారికి న్యాయం చేసేందుకు నేను తెరాసలో చేరుతున్నాను. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు. ఇక నుంచి సిఎం కేసీఆర్ నాయకత్వంలో నా జిల్లా, నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తాను. తెరాసలో చేరేటప్పుడు టిడిపి ద్వారా గెలుచుకొన్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ తెరాస తరపున ఉపఎన్నికలలో పోటీ చేయాలని భావిస్తున్నాను. ఇదే విషయం శనివారం సిఎం కేసీఆర్ను కలిసినప్పుడు చర్చించాను. తెరాసలో ఎప్పుడు చేరేది త్వరలోనే తెలియజేస్తాను,” అని చెప్పారు.