అసెంబ్లీ వద్ద కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మెరుపు ధర్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు(ఆసిఫాబాద్‌), రేగా కాంతారావు (పినపాక) తాము తెరాసలో చేరబోతున్నట్లు చేసిన ప్రకటనపై రాష్ట్ర కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది. ఈరోజు ఉదయం సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అధ్యక్షతన గాంధీభవన్‌లో తెలంగాణ సీఎల్పీ అత్యవసర సమావేశం నిర్వహించి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఫిరాయింపుపై చర్చించారు. సమావేశం ముగిసిన వెంటనే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలందరూ నల్ల బ్యాద్జీలు ధరించి అసెంబ్లీ వద్దకు చేరుకొని గాంధీ విగ్రహం వద్ద మెరుపు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ఎన్నికలలో అక్రమాలు చేసి గెలిచిన కేసీఆర్‌, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఇంకా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఉండకూడదనే దురుదేశ్యంతోనే ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రతిపక్షాలను బలహీనపరుస్తున్నారు. ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు సిఎం కేసీఆర్‌ ఎంత సొమ్ము చెల్లించి కొనుగోలు చేశారో చెప్పాలి. ఈ వ్యవహారాన్ని ఇక్కడితో వదిలిపెట్టబోము. రాష్ట్ర వ్యాప్తంగా ఫిరాయింపులను నిరసిస్తూ ఉద్యమిస్తాము,” అని అన్నారు.