సిఎంను కలిసిన సండ్ర

తెరాస ప్రభంజనాన్ని తట్టుకొని అసెంబ్లీ ఎన్నికలలో సత్తుపల్లి నుంచి గెలిచిన టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎన్నికల తరువాత తెరాసలో చేరబోతున్నారని, మంత్రి పదవి కూడా ఆశిస్తున్నారని ఆ మద్యన మీడియాలో చాలా ఊహాగానాలు వినిపించాయి. కానీ నేటికీ ఆయన టిడిపిలోనే కొనసాగుతుండటంతో ఆ వార్తలు చల్లారిపోయాయి. కానీ మళ్ళీ ఊహాగానాలకు వీలుకల్పిస్తూ ఆయన శనివారం ప్రగతి భవన్‌కు వెళ్ళి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. 

ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, వైరా, పాలేరు, మధిర నియోజకవర్గాలలో దాదాపూ రెండున్నర లక్షల ఎకరాలలో వేసిన ఆరుతడి, మెట్ట పంటలు నీళ్ళు లేక ఎండిపోతున్నాయని కనుక తక్షణం నాగార్జున సాగర్ నుంచి కనీసం ఓ 10 రోజుల పాటు నీళ్ళు అందించాలని కోరుతూ ఆయన సిఎం కేసీఆర్‌కు ఒక వినతిపత్రం అందించారు. దానిపై వెంటనే స్పందించిన సిఎం కేసీఆర్‌, సాగర్ ఎడమ కాల్వ నుంచి నీళ్ళు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. 

అనంతరం సండ్ర వెంకటవీరయ్య మీడియాతో మాట్లాడుతూ కేవలం రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకే కలిశాను తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదని చెప్పారు. ఆయన ఏ కారణంతో ముఖ్యమంత్రిని కలిసినప్పటికీ మళ్ళీ తెరాసలో చేరబోతున్నారనే ఊహాగానాలు మొదలవడం తధ్యం.