యూనిఫారంలో భర్త అంత్యక్రియలకు హాజరైన భార్య

భార్యాభర్తలిద్దరూ పైలట్లు కావడం...అదీ ఒకే చోట పనిచేస్తుండటం చాలా అరుదైన విషయమే. అటువంటి అరుదైన దంపతులు స్క్వాడ్రన్‌ లీడర్‌ సిద్ధార్థ్‌ వశిష్ట్‌, స్క్వాడ్రన్‌ లీడర్‌ ఆర్తీసింగ్‌. అటు ఉద్యోగంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఇద్దరూ మంచి జంట అని పేరుంది. అటువంటి అన్యోన్యమైన జంటకు ఎడబాటు కలిగింది. 

రెండు రోజుల క్రితం కశ్మీరులోని బుద్గామ్ జిల్లాలో కూలిపోయిన మిగ్-17 యుద్దవిమానంలో స్క్వాడ్రన్‌ లీడర్‌ సిద్ధార్థ్‌ వశిష్ట్‌ చనిపోయిన సంగతి తెలిసిందే. భారత్‌ వాయుసేన అధికార లాంచనాలతో చండీగఢ్‌లో శుక్రవారం సిద్దార్ధ్ అంత్యక్రియలు నిర్వహించి నివాళులు అర్పించింది. భర్త పోయిన దుఃఖాన్ని, బాధను దిగమింగుకొంటూ ఆర్తీసింగ్‌ యూనిఫారం ధరించి వచ్చి తోటి వాయుసేన అధికారులతో కలిసి భర్తకు నివాళులు అర్పించింది. అది చూసి అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. భర్తను కోల్పోయినప్పటికీ దేశం కోసం తాను పనిచేయడానికి సిద్దంగా ఉన్నానని ఆమె చెప్పకనే చెప్పుతున్నారు. 

అంతకంటే బాధాకరమైన విషయమేమిటంటే, కొడుకు చేత తలకొరివి పెట్టించుకోవలసిన సిద్ధార్థ్‌ వశిష్ట్‌ తండ్రి స్వయంగా కొడుకు చితికి నిప్పు పెట్టవలసి రావడం.