అభినందన్ భారత్‌ వచ్చేశారు

వింగ్ కమాండర్ అభినందన్‌ వర్ధమాన్‌ను పాక్‌ అధికారులు కొద్దిసేపటి క్రితం భారత్‌ అధికారులకు అప్పగించారు. భద్రతా ఆనవాయితీ ప్రకారం అభినందన్‌కు భారత్‌ వైద్య బృందం వాఘా వద్దే కొన్ని వైద్య పరీక్షలు చేసిన తరువాత భారత్‌ అధికారులు ఆయనను పాక్‌ కార్యాలయం నుంచి తోడ్కొని భారత్‌లోకి తీసుకువచ్చారు. ఏమీ జరగనట్లు నిబ్బరంగా ఉన్న ఆయనను చూడగానే అక్కడ ఉదయం నుంచి ఎదురుచూస్తున్న ప్రజలు జేజేలు పలికారు. భారత్‌ మాతాకీ జై... అభినందన్ జిందాబాద్ అంటూ స్వాగతం పలికారు. ఆయనను ఫోటోలు తీసుకోవడానికి మీడియాను అనుమతించినప్పటికీ ఆయనతో మాట్లాడేందుకు అనుమతించలేదు.

అనంతరం ఆయనను వాహనంలో అమృత్‌సర్‌కి తీసుకువెళుతున్నారు. ఆ వాహనంలో అతని తల్లితండ్రులు కూడా ప్రయాణించడానికి అధికారులు అనుమతించారు. అమృత్‌సర్‌ నుంచి వాయుసేనకు చెందిన విమానంలో అభినందన్‌ వర్ధమాన్‌ను డిల్లీ తీసుకువెళతారు. అక్కడ పూర్తిస్థాయి వైద్య పరీక్షలు చికిత్సలు చేస్తారు. ఆయన మానసిక పరిస్థితిని, ఆరోగ్యస్థితిని పూర్తిగా అంచనా వేసి నివేదిక సమర్పిస్తారు. ఆ తరువాత వైద్యుల సూచన మేరకు అధికారులు తగిన నిర్ణయం తీసుకొంటారు. ఆయన షాక్ నుంచి పూర్తిగా కోలుకొన్న తరువాత ఇంటలిజన్స్ మరియు రా అధికారులు ఆయనను ప్రశ్నించి పాక్‌లో బందీగా ఉన్నప్పుడూ ఏమి జరిగింది?పాక్ అధికారులు ఆయన నుంచి ఏమేమి సమాచారం రాబట్టడానికి ప్రయత్నించారు? వాటికి ఆయన ఏమి సమాధానాలు చెప్పారు? వంటి వివరాలను అడిగి తెలుసుకొంటారు. ఆ తరువాతే ఆయనకు మళ్ళీ పైలట్ బాద్యతలు అప్పగించాలా లేక వేరే బాద్యతలు అప్పగించాలా అనే విషయం నిర్ణయం అవుతుంది.