
పాక్ చేతికి బందీగా చిక్కిన భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను మరికొద్ది సేపటిలో పాక్ అధికారులు పంజాబ్ లోని వాఘా బోర్డర్ గేట్ వద్ద భారత్ అధికారులకు అప్పగించనున్నారు. ఈరోజు ఉదయం 10-11 గంటల నుంచే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వందలాదిమంది ప్రజలు వాఘా బోర్డర్ తరలివచ్చి ఆయనకు స్వాగతం పలకడానికి ఎదురుచూస్తున్నారు. కొందరు త్రివర్ణపతాకాలు చేతపట్టుకొని ‘భారత్ మాతాకు జై’ అంటూ నినాదాలు చేస్తుంటే, మరికొందరు డోలు వాయిస్తూ ఆనందంగా నృత్యాలు చేస్తూ అభినందన్ రాక కోసం ఎదురుచూస్తున్నారు.
అభినందన్ తల్లితండ్రులు కూడా అక్కడకు చేరుకొన్నారు. అటువంటి సాహసవంతుడైన గొప్ప వీరుడిని కన్నందుకు ప్రజలు వారిరువురినీ ప్రశంశిస్తూ పూలదండలతో సత్కరిస్తున్నారు....అభినందిస్తున్నారు. ప్రజల కళ్ళలో ఆ సంతోషం, తమ కొడుకు పట్ల వారు చూపుతున్న ఆ గౌరవాభిమానాలు చూసి అభినందన్ తల్లితండ్రులు ఎంత మురిసిపోతున్నారో ఊహించుకోవచ్చు.
అభినందన్‌ను విడుదల చేయడానికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంగీకరించిన తరువాత, అతనిని ప్రత్యేక విమానంలో భారత్ తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. కానీ పాక్ అధికారులు అందుకు అంగీకరించలేదు. అభినందన్‌ను రోడ్డు మార్గం ద్వారా తీసుకువచ్చి వాఘా గేట్ వద్ద అప్పగిస్తామని చెప్పడంతో, పాక్‌లోని భారత్ హైకమీషనర్ విడుదలకు సంబందించిన పత్రాలను నిన్న సాయంత్రమే పూర్తిచేసి వారికి అప్పగించారు.
లాహోర్ నుంచి వాఘా బోర్డర్ గేట్ సుమారు 23 కిమీ దూరం ఉంది. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు అప్పగిస్తారని భావించినప్పటికీ 3-4 గంటలకు అప్పగించవచ్చునని తాజా సమాచారం.
అభినందన్‌కు స్వాగతం పలకడానికి ఎయిర్ ఫోర్స్ అధికారులు వాఘా బోర్డర్ దగ్గరకు చేరుకొని ఎదురు చూస్తున్నారు. అతని అప్పగింత కార్యక్రమం పూర్తికాగానే డిల్లీ తీసుకువెళ్లి ముందుగా వైద్యపరీక్షలు, అవసరమైన వైద్య చికిత్సలు చేయిస్తారని సమాచారం.