ఎల్బీనగర్‌ ఫ్లై ఓవర్ ప్రారంభం

హైదరాబాద్‌ నగరవాసులు ఎన్నాళ్ళగానో ఎదురుచూస్తున్న ఎల్బీ నగర్ ఫ్లై ఓవర్‌కు నేడు ప్రారంభోత్సవం అయ్యింది. మంత్రులు తలసాని, మహమూద్ ఆలీ రిబ్బన్ కట్ చేసి ఫ్లై ఓవర్‌ను ప్రారంభించారు. రూ.42 కోట్లతో నిర్మించిన ఈ ఫ్లై ఓవర్‌ ఎల్బీ నగర్ మీదుగా దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు నిర్మించబడింది. 780 మీటర్లు పొడవు, 12 మీటర్ల వెడల్పుతో మూడు లేన్లతో వన్-వేగా ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. దీంతో ఎల్బీనగర్‌ చౌరస్తాలో 90 శాతం వరకు ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు చెపుతున్నారు. చిరకాలంగా ట్రాఫిక్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు దీంతో చాలా ఉపశమనం లభిస్తుంది. 



ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్ ఆలీ, మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే డి.సుధీర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిశోర్‌, డిప్యూటీ మేయర్‌ బాబా పషుద్దీన్‌, జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస రెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీధర్‌, స్థానిక కార్పొరేటర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ “అనేక ఏళ్లుగా ఎల్బీ నగర్ కూడలిలో ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు అవస్థలు పడుతున్నప్పటికీ సమైక్యరాష్ట్రంలో పాలకులు పట్టించుకోలేదు. కానీ తెలంగాణ ఏర్పడిన నాలుగేన్నరేళ్ళలోనే దీనితో సహా నగరంలో అనేక ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు, కొత్త రోడ్ల నిర్మాణాలు చేపట్టాము. వాటిలో కొన్ని పూర్తవగా మరికొన్ని త్వరలో పూర్తవబోతున్నాయి. హైదరాబాద్‌ నగరంలోనే ఫ్లై-ఓవర్లు, అండర్ పాసులు, కొత్త రోడ్ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.448 కోట్లు ఖర్చు చేస్తోంది. సిఎం కేసీఆర్‌, కేటీఆర్‌ ఇద్దరూ నగరాభివృద్ధిపై ప్రత్యేకశ్రద్ద చూపడం వలననే ఇంతవేగంగా ఇవన్నీ పూర్తవుతున్నాయి,” అని అన్నారు.