
కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఈ నెల నుంచి గ్రామాలలో జరిగే వివాహాలను స్థానిక పంచాయతీ కార్యదర్శి రిజిస్ట్రేషన్ చేసి వధూవరులకు మేరేజ్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇందుకు సంబందించి కొత్త చట్టంలో అవసరమైన మార్గదర్శకాలను స్పష్టం పేర్కొనబడ్డాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివాహాల నమోదుకు ఒకే రకమైన రిజిస్ట్రేషన్ విధానం అమలుచేయడానికి వీలుగా నిబందనలు రూపొందించారు. పంచాయతీ కార్యాలయాలకు అందుకు అవసరమైన దరఖాస్తులు, సర్టిఫికెట్లు వగైరాలను ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ అందజేసింది.
ఈ చట్టం అమలుచేయడానికి మరో బలమైన కారణం కూడా ఉంది. దశాబ్ధాల క్రితమే బాల్యవివాహాలు నిషేదించినప్పటికీ, నేటికీ పల్లెల్లో మైనార్టీ తీరని బాలబాలికల వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. వాటికి అడ్డుకట్టవేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
ఇకపై గ్రామపంచాయితీలోనే మేరేజ్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది కనుక గ్రామస్తులు మేరేజ్ సర్టిఫికేట్ కోసం పట్టణాలకు వెళ్ళనవసరం లేదు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న వివిద సంక్షేమపధకాలను పొందేందుకు, విదేశాలలో ఉద్యోగాలకు వెళ్ళేవారికి, ప్రభుత్వోద్యోగాల కోసం దరఖాస్తు చేసుకొనేవారికి ఈ మేరేజ్ సర్టిఫికెట్లు చాలా అవసరం. కానీ ఈవిషయం తెలియక నగరవాసులు కూడా నేటికీ మేరేజ్ సర్టిఫికేట్ తీసుకోకుండా అలసత్వం ప్రదర్శిస్తారు. గ్రామ పంచాయతీలు కార్యదర్శులకే ప్రభుత్వం ఈ బాధ్యతను అప్పజెప్పింది గనుక ఇకపై గ్రామాలలో జరిగే వివాహాలను నమోదు చేయడం, వాటికి మేరేజ్ సర్టికెట్లు ఇవ్వడం అనివార్యం అవుతాయి.