అభినందన్‌ను రేపు విడుదల చేస్తాం: ఇమ్రాన్ ఖాన్

రేపు ఒక అద్భుతం జరుగబోతోంది. పాక్‌ చేతికి బందీగా చిక్కిన భారత పైలట్ అభినందన్‌ వర్ధమాన్‌ను శుక్రవారం విడుదల చేస్తున్నామని పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఈరోజు పాక్‌ పార్లమెంటులో ప్రకటించారు. భారత్‌ చేసిన దౌత్యం కారణంగా పాక్‌పై అంతర్జాతీయ ఒత్తిడి పెరిగినందునో లేక ఈవిధంగానైనా ఈ అవమానకర పరిస్థితుల నుంచి సగౌరవంగా బయటపడి ప్రపంచదేశాల మెప్పు పొందాలనే ఉద్దేశ్యంతోనో ఇమ్రాన్ ఖాన్‌ ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. కారణం ఏదైనప్పటికీ పాక్‌ చేతిలో చిక్కిన ఒక భారత్‌ సైనికుడు సురక్షితంగా ప్రాణాలతో బయటపడితే అది నిజంగా అద్భుతమే. రేపు ఆ అద్భుతం జరుగబోతోంది. 

ఈరోజు రాత్రి భారత్‌-పాక్‌ ప్రధానులు ఫోన్లో మాట్లాడుకోబోతున్నట్లు తాజా సమాచారం. ఒకవేళ అదే జరిగితే ఇరుదేశాల మద్య ఉద్రిక్తతలు తగ్గవచ్చు. అంతమాత్రన్న భారత్‌పై పాక్‌ ప్రేరిత ఉగ్రదాడులు నిలిచిపోతాయని ఆశించలేము కనుక మళ్ళీ ఏదో ఒకరోజు ఇటువంటి పరిస్థితులే పునరావృతమైనా ఆశ్చర్యం లేదు.