విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు

విశాఖ ప్రజలు ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ బుదవారం అధికారికంగా ప్రకటించారు. విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో కూడిన ఈ కొత్తజోన్‌కు సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్ గా నామకరణం చేస్తున్నట్లు తెలిపారు. కానీ మళ్ళీ దానిలో చిన్న మెలిక పెట్టారు. ప్రస్తుతం భువనేశ్వర్ కేంద్రంగా పనిచేస్తున్న ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో (విశాఖలోని) వాల్తేర్ డివిజన్ ఉంది. అది పూర్తిగా విశాఖకే దక్కలని విశాఖవాసులు కోరుతుంటే దానిని రెండు భాగాలుగా విభజించి దానిలో ఒక భాగాన్ని భువనేశ్వర్ కేంద్రంగా పనిచేస్తున్న ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోని రాయగడ డివిజనులో కలుపుతామని, మరో భాగాన్ని విజయవాడ డివిజనులో కలుపుతామని మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. అతి ముఖ్యమైన ఈ విషయాన్ని పట్టించుకోకుండా ‘మేమే కేంద్రంతో పోరాడి విశాఖ రైల్వే జోన్ సాధించామని’ అప్పుడే రాజకీయ నేతలు గొప్పలు చెప్పుకొంటున్నారు. అది పేరుకు విశాఖ రైల్వే జోనే కానీ సంపూర్ణంగా కాదనే చెప్పవచ్చు.