రేవంత్‌ రెడ్డి అరెస్ట్ కేసు తాజా పరిణామాలు

అసెంబ్లీ ఎన్నికలలో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డిని పోలింగుకు రెండురోజుల ముందు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్ధిని కీలకమైన ఆ సమయంలో అరెస్ట్ చేసి పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆ కారణంగా రేవంత్‌ రెడ్డి హక్కులకు భంగం కలిగిందని, ఎన్నికలలో ఓడిపోయి రాజకీయంగా చాలా నష్టపోయారని, కనుక ఆయనకు నష్టపరిహారం ఇప్పించాలని, అలాగే ఆయనను అరెస్ట్ చేసిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రేవంత్‌ రెడ్డి స్నేహితుడు వేం నరేందర్‌రెడ్డి హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 

 దానిపై నిన్న హైకోర్టులో జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఇరుపక్షాలవాదనలు విన్న తరువాత రేవంత్‌ రెడ్డి అరెస్ట్ తాలూకు వీడియో ఫుటేజిని సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. అరెస్ట్ చేస్తున్నప్పుడు పోలీసులకు-రేవంత్‌ రెడ్డి-కుటుంబసభ్యులకు మద్య జరిగిన వాగ్వావాదనలను, అక్కడ జరిగిన పరిణామాలను తెలియజేస్తూ వీడియోలో సబ్-టైటిల్స్ కూడా ఏర్పాటు చేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఆ వీడియోను కూడా చూసిన తరువాతే ఈ కేసులో తుది తీర్పు వెలువరిస్తామని చెపుతూ కేసును వాయిదా వేసింది.