
తెరాస, మజ్లీస్ పార్టీలకు చెందిన ఐదుగురు ఎమ్మెల్సీ అభ్యర్ధులు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. హోంమంత్రి మహమూద్ అలీ, శేరి సుభాష్ రెడ్డి, సత్యవతీ రాథోడ్, యెగ్గే మల్లేశం తెరాస నేతలతో కలిసి సోమవారం ఉదయం గన్ పార్కువద్దకు వెళ్ళి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అక్కడి నుంచి వారు శాసనసభకు చేరుకొని శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులకు తమ నామినేషన్ పత్రాలు అందించారు. తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, రెడ్యానాయక్, కాలే యాదయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మజ్లీస్ అభ్యర్ధిగా మిర్జా రియాజ్ ఉల్ హసన్ కూడా సోమవారం తన నామినేషన్ దాఖలు చేశారు. మజ్లీస్ ఎమ్మెల్యేలు జాఫర్ హుస్సేన్, అహ్మద్ బలాల తదితరులు ఆయన వెంట ఉన్నారు.
కాంగ్రెస్, టిడిపిలకు కలిపి మొత్తం 21 మంది ఎమ్మెల్యేలున్నారు కనుక (పార్టీలో ఎవరూ ఫిరాయించకుండా, క్రాస్ ఓటింగ్ చేయకుండా ఉన్నట్లయితే) ఒక్క ఎమ్మెల్సీ సీటును తప్పక గెలుచుకోగలదు. కనుక ఆ ఒక్క సీటు కోసం పార్టీలో 33 మంది పోటీ పడుతున్నట్లు తాజా సమాచారం. నామినేషన్లకు గడువు 28తో ముగుస్తుంది కనుక అభ్యర్ధి ఎంపికకు ఏర్పాటు చేసుకొన్న కాంగ్రెస్ ఉపకమిటీ నేడు గాంధీభవన్‌లో సమావేశమయ్యి అభ్యర్ధి పేరును ఖరారు చేయనున్నది.