
ఒకే రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుల మద్య మాటల యుద్ధాలు జరుగుతుండటం సహజమే కానీ తెలంగాణకు చెందిన తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మద్య మాటల యుద్ధం జరుగుతుండటం విచిత్రంగా ఉంది.
“ఈసారి ఎన్నికలలో చంద్రబాబునాయుడుకి ఓటమి తప్పదు...జగన్ ముఖ్యమంత్రి కావడం తద్యం” అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సహజంగానే చంద్రబాబు, టిడిపి నేతలు తీవ్రంగా స్పందించారు. “మోడీ, కేసీఆర్, జగన్ ముగ్గురూ కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు. ముగ్గురు ముసుగులు తీసేసి వస్తే తెలుగు ప్రజలు వారికి తగినవిధంగా బుద్ధి చెపుతారు,” అని చంద్రబాబు అన్నారు.
ఆయన వ్యాఖ్యలపై కేటీఆర్ కూడా ఇంకా ఘాటుగా స్పందించారు. ఈరోజు సాయంత్రం తెలంగాణ భవన్‌లో జరిగిన ఒక సమావేశంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కుట్రలు, కుతంత్రాలకు చంద్రబాబునాయుడే పేటెంట్ తీసుకొన్నారు. చీమలు చేసుకొన్న పుట్టలో పాము దూరినట్లు మావగారు ఏర్పాటు చేసిన టిడిపిలో దూరి ఆయనకే వెన్నుపోటు పొడిచారు. ఇక్కడకు వచ్చి కుట్రలు చేయబోతే తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పి ఇంటికి పంపించారు. ఇప్పుడు ఏపీ ప్రజలు కూడా ఆయనను ఓడించేందుకు ఎదురుచూస్తున్నారు. కనుక ఆయనను ఓడించేందుకు మేము ఏపీకి వెళ్ళనవసరం లేదు. ఏపీ ప్రజలే ఆపని చేయనున్నారు. జాబు కావాలంటే బాబు రావాలని గత ఎన్నికలలో టిడిపి ప్రచారం చేసుకొంది. కానీ చంద్రబాబు పోతేనే జాబులొస్తాయని ఇప్పుడు ఏపీ ప్రజలనుకొంటున్నారు,” అని అన్నారు.