
తెలంగాణ అసెంబ్లీ ఉపసభాపతిగా పద్మారావుగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ప్రతిపక్షపార్టీలు తమ అభ్యర్ధిని నిలబెట్టకుండా ఆయనకు మద్దతు ప్రకటించడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. బడ్జెట్ సమావేశాలకు చివరి రోజైన సోమవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు మొదలవగానే ముందుగా బిజెపి నేత బద్దం బాల్‌రెడ్డి మృతికి సభ్యులు అందరూ నివాళులర్పించారు. అనంతరం పద్మారావుగౌడ్ ఉపసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. సిఎం కేసీఆర్, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు, శాసనసభ్యులు ఆయనవద్దకు వెళ్ళి అభినందనలు తెలిపారు. పద్మారావు గౌడ్ గత ప్రభుత్వంలో క్రీడలు, యువజన వ్యవహారాలు మరియు అబ్కారీ శాఖామంత్రిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్‌పై నేటితో చర్చ ముగించి ఆమోదం తెలిపిన తరువాత ఉభయసభలు నిరవధికంగా వాయిదా పడతాయి.