త్వరలో తలసాని ఏపీ పర్యటన

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో జరిగిన రాజకీయ పరిణామాల కారణంగా త్వరలో జరుగబోయే లోక్‌సభ, ఏపీ శాసనసభ ఎన్నికలలో తెరాస జోక్యం చేసుకోవాలని నిర్ణయించిన నేపధ్యంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈరోజు ఒక ముఖ్య ప్రకటన చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్‌ ప్రజలతో నాకు గత 30 ఏళ్ళుగా మంచి అనుబందం ఉంది. కనుక మార్చి 3న  విజయవాడకు వెళ్ళి అక్కడి బీసీ నేతలతో సమావేశం అవుతాను. సిఎం కేసీఆర్‌ ఆదేశిస్తేతే అక్కడి బీసీలను ఏకం చేస్తాను,” అని చెప్పారు. 

తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పటికే ఒకసారి విజయవాడ, భీమవరం వెళ్ళి బీసీ నేతలతో సమావేశమయ్యారు. మళ్ళీ మార్చి 3న వారితో సమావేశమైనప్పుడు నిర్ధిష్టమైన కార్యాచరణ ప్రకటించవచ్చు. 

తలసాని రాష్ట్ర పర్యటనలు, రాజకీయ వ్యూహాలను చూస్తున్న టిడిపి నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తలసాని చేస్తున్న ఇటువంటి ప్రయత్నాల వలన బీసీలు టిడిపికి దూరం అవుతారేమోనని ఆందోళన చెందుతోంది. అందుకే బీసీలను ప్రసన్నం చేసుకొనేందుకు టిడిపి ప్రభుత్వం వరాలు ప్రకటిస్తోంది. బీసీలను వైకాపావైపు మళ్లించడం ద్వారా టిడిపిని దెబ్బతీసి ఏపీలో వైకాపాను అధికారంలోకి తీసుకురావాలని తెరాస అధినేత కేసీఆర్‌ యోచనగా కనిపిస్తోంది. ఆయన ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో తెలియాలంటే ఎన్నికలు పూర్తయ్యేవరకు ఎదురుచూడవలసిందే.