
బెంగళూరు సమీపంలో యెలహంకా వద్ద జరుగుతున్న ఎయిరో ఇండియా షో (విమాన ప్రదర్శన)లో నేడు మరో అపశృతి జరిగింది. ఆ షోను తిలకించడానికి వచ్చినవారు సమీపంలో తమ కార్లను వరుసగా నిలిపి ఉంచారు. హటాత్తుగా మంటలు చెలరేగడంతో సుమారు 100 కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. వెంటనే అగ్నిమాపకదళాలు అక్కడకు చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ప్రాంతమంతా ఎండిపోయిన గడ్డి, ఆకులతో నిండి ఉండటంతో మంటలు శరవేగంగా వ్యాపించాయి. ఆ సమయంలో ఆ కార్ల యజమానులు అందరూ వాటికి దూరంగా గ్యాలరీలలో కూర్చొని విమాన ప్రదర్శనలు చూస్తుండటంతో ప్రాణ నష్టం జరుగలేదు.
ఈ ఎయిరో ఇండియా షో మొదలయ్యే ముందురోజే రెండు సూర్యకిరణ్ యుద్ధవిమానాలు పొరపాటున గాలిలో ఒకదానినొకటి డీకొని కూలిపోయాయి. ఆ ప్రమాదంలో ఒక పైలట్ మృతి చెందారు. ఆ ప్రమాదం జరిగిన నాలుగు రోజులకే మళ్ళీ అదే ప్రాంతంలో నేడు ఈ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదానికి కారణం తెలియవలసి ఉంది.
(Photo and Video courtesy: New Indian Express)