సిబిఐ అధికారులను అరెస్ట్ చేసిన కోల్‌కతా పోలీసులు!

కోల్‌కతాలో ఆదివారం రాత్రి నుంచి హైడ్రామా మొదలైంది. శారదా చిట్‌ఫండ్‌ కుంభకోణం కేసులో కోల్‌కతా పోలీస్ కమీషనర్ రాజీవ్‌కుమార్‌ను ప్రశ్నించేందుకు 40 మంది సిబిఐ అధికారులు ఆదివారం సాయంత్రం ఆయన నివాసానికి చేరుకున్నారు. వారిని అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది లోపలకు అనుమతించలేదు. పైగా వారినందరినీ నిర్బందించి పోలీసు స్టేషన్‌కు తరలించారు. వారిని నిర్బందించిన సంగతి తెలుసుకొని మరికొందరు సిబిఐ అధికారులు పోలీస్ కమీషనర్ నివాసానికి చేరుకోగా వారిని కూడా పోలీసులు నిర్బందించారు. “కమీషనరును ప్రశ్నించేందుకు వారివద్ద తగిన పత్రాలు, అనుమతులు ఉన్నాయా లేవా?” అని దృవీకరించుకునేందుకే వారీనందరినీ పోలీసు స్టేషన్‌కు తరలించామని, ఆ తరువాత వారీనందరినీ విడిచిపెట్టేసినట్లు కోల్‌కతా పోలీసులు తెలిపారు. సిబిఐ అధికారులను పోలీసులు అరెస్ట్ చేయడంతో రెండు రాజ్యాంగబద్దమైన సంస్థల మద్య ప్రచ్చన్నయుద్దం  మొదలైంది.

ఈ విషయం తెలుసుకున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం రాత్రి కోల్‌కతాలోని మెట్రో ధియేటర్ సమీపంలో హటాత్తుగా నిరసన దీక్షకు కూర్చోన్నారు. దాంతో అగ్నికి ఆజ్యం పోసిన్నట్లయింది. మోడీ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ఉద్దేశ్యపూర్వకంగానే తమను వేధిస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం శారదా చిట్‌ఫండ్‌ కుంభకోణం కేసులో ప్రశ్నించడానికి వచ్చిన సిబిఐ అధికారులను కోల్‌కతా పోలీసుల చేత అరెస్ట్ చేయించడం కోర్టుధిక్కారం, చట్ట విరుద్దమని బిజెపి నేతలు వాదిస్తున్నారు. మొదట సిబిఐ-పోలీస్ అధికారులకు మద్య మొదలైన వివాదం, మమతా బెనర్జీ దీక్షకు కూర్చోవడంతో కేంద్రానికి-పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి మద్య రాజకీయ యుద్ధంగా మారిందిప్పుడు.